గురువారం, ఫిబ్రవరి 20, 2014

రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) కథ 'ఓడిపోయిన సంస్కారం'

ఈ రామనాధం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఔను – భర్త గుణగణాలమీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడుతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే ? – ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో? మొదట మంచివాళ్ళుగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో?