ఆదివారం, జనవరి 19, 2014

కేతు విశ్వనాధ రెడ్డి కథ 'కూలిన బురుజు'

ఇది ఊరా? వల్లకాడ? ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జలదరించింది. ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచి ఉన్నాయి. ఎగువ వీధిలో, ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళారు.
ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను. బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడూ ఉండే జనం లేరు. బురుజు పైకి చూశాను. సగం పడిపోయింది. పైన పిచ్చిమొక్కలూ… ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకూ, ఐక్యతకూ సంకేతం. ఇప్పుడో?